Food : భోజన ప్రియులకు రసం అంటే ఎంతో ఇష్టం. భోజనం చివరలో చాలామంది రసంను ఇష్టపడతారు. మరి కొంతమందికైతే రసం ఉంటేనే భోజనం చేసాం అనే ఫీలింగ్ ఉంటుంది. ఇక మన తెలుగు ప్రజలకైతే కచ్చితంగా రసం ఉండాల్సిందే. ఈ టిప్స్ తో రసాన్ని రుచికరంగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం.
ముందుగా రసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏమిటంటే.. నిమ్మ పండు సైజ్ అంత చింతపండు, ఒక పెద్ద సైజు టమోటా, ఒక టీ స్పూన్ మిరియాలు, ఒకటిన్నర టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు, మూడు ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ పొడి, రెండు టేబుల్ స్పూన్ల నూనె, అర టీ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పును తీసుకోవాలి.
ముందుగా చింతపండును ఒక గిన్నె లో కాస్త నీరు తీసుకొని నానబెట్టాలి. ఒక పది నిమిషాల తర్వాత చింతపండును జ్యూస్ లాగా పిండి పిప్పిని తీసేయాలి.తర్వాత మిరియాలు, ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, జిలకర, వెల్లుల్లి రెబ్బలను మిక్సీ వేసుకోవాలి. కావాలంటే ఈ పొడిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు.
తర్వాత ఇంతకుముందు చేసుకున్న చింతపండు రసంలో ఒక బాగా పండిన టమాటాను గట్టిగా పిండి ఆ జ్యూస్ ను అందులో కలపాలి. తర్వాత స్టవ్ ను లో ఫ్లేమ్ లో ఉంచి ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. తర్వాత అందులో ఎండుమిరపకాయలను ముక్కలుగా తుంచి అందులో వేసుకోవాలి. వీటితోపాటు 10 లేదా 12 కరివేపాకు ఆకులు వేసుకోవాలి.
తర్వాత ఇందులో మిక్సీ వేసి పొడి వేసి బాగా వేయించాలి. తర్వాత ఇందులో పసుపును వేసి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఈ మసాలా మాడిపోయిన లేదా వేగకపోయినా రుచి అనేది ఉండదు. జాగ్రత్తగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు రసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత సరిపడా నీళ్లు వేసి బాగా ఉడికించాలి.
ఇక ఈ రసం బాగా ఉడికి బుడగలు వచ్చేవరకు ఉడికించుకోవాలి. ఈ సమయంలో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.ఎప్పుడైతే బుడగలు వస్తాయో వెంటనే స్టౌ ఆఫ్ చేయాలి. అంటే రుచి మారిపోతుంది. తర్వాత ఇందులో కొత్తిమీర కాస్త వేసి కలుపుకోవాలి. ఇక మంచి సువాసన గల, రుచికరమైన రసం రెడీ.
ఈ రసాన్ని అన్నంలో వేసుకుని ఒక్కసారి టెస్ట్ చేస్తే ప్రతిరోజు చేసుకొని తినాలనిపిస్తుంది. ఇందులో మిరియాలు వేయడం ద్వారా ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు చాలావరకు తగ్గుతాయి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినవచ్చు. ఇక ఈ రసంని భోజన ప్రియులు టెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇష్టపడతారు.