Health Tips : ప్రపంచంలో గుండెపోటు తీవ్రమైన వ్యాధిగా మారింది. ఒక్క భారతదేశంలోనే హృదయ రోగుల సంఖ్య కోట్లలో ఉంది. గత కొన్ని నెలలుగా దేశంలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. పెద్దా, చిన్నా అనే తేడా లేదు.. యుక్తవయస్సులోనే చాలామందికి గుండెపోటు వస్తోంది. అలాగే చాలా సందర్భాల్లో సడన్ హార్ట్ స్ట్రోక్స్ వల్ల మృత్యువాత పడుతున్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో యువత కూడా ఈ వ్యాధి బారిన పడుతుండటం ఆందోళన కలిగించే విషయం.
అంతేకాదు అకాలంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. చాలా సందర్భాలలో గుండె జబ్బులు జన్యుపరమైనవి కావు. జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల సంభవిస్తున్నాయి. సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, పోస్ట్ కోవిడ్ కారణంగా గుండెపోటు కేసులు పెరుగుతున్నట్లు తెలిసింది. జంక్ ఫుడ్, మద్యం సేవించడం, ధూమపానం లాంటి అలవాట్లు గుండె జబ్బులకు దారి తీస్తాయి. దీనితో పాటు, కరోనా కారణంగా గుండె ధమనులలో రక్తం గడ్డకట్టడం వల్ల, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
గుండెపోటు రాకుండా ఉండాలంటే మనం ఏ తప్పులు చేయకూడదో తెలుసుకోవాలి.
1. స్లీప్ డిజార్డర్
మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది ఆరోగ్య నిపుణులు రోజులో కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని చెబుతున్నారు. తగినంత నిద్ర లేని వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
2. వాయుకాలుష్యం
పెద్ద నగరాల కంటే గ్రామాల ప్రజలకు గుండెపోటు రిస్క్ తక్కువగా ఉంటుంది. వారు స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల పొగ, డస్ట్‌కి దూరంగా ఉంటున్నారు. ఇవి రెండు గుండెకు చాలా హాని కలిగిస్తున్నాయని అనేక పరిశోధనలలో వెల్లడైంది. కాబట్టి గుండెపోటుని నివారించాలంటే స్వచ్ఛమైన గాలి ఉండే దగ్గర ఉంటే మంచిది.
3. ధూమపానం, మద్యపానం
సిగరెట్, ఆల్కహాల్ మన శరీరానికి అంతర్గత నష్టాన్ని కలిగిస్తున్నాయని అందరికి తెలుసు. ఈ చెడు అలవాట్ల కారణంగా రక్తపోటు పెరుగుతుంది. ఇది తరువాత గుండెపోటుకు కారణం అవుతుంది. అందుకే వెంటనే మానేస్తే మంచిది.
4. వ్యాయమం చేయాలి
రోజూ వ్యాయామం చేస్తే కనీసం గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ అవుతుంది.
ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్యనైనా మన శరీరం ముందే గుర్తించి, దాని సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. వాటిని సకాలంలో గుర్తించి సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలా మంది మహిళలు గుండె జబ్బులు, స్ట్రోక్‌ల బారిన పడుతున్నారు.హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు స్త్రీలలో కనిపించే సంకేతాల గురించి నిపుణులు తెలియజేశారు. మీరు ఇలాంటి లక్షణాలను గమనిస్తే, వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
చేతుల్లో బలహీనత గుండెకు రక్తం సరిగ్గా ప్రవహించలేనప్పుడు, చేతిలో బలహీనత మొదలవుతుంది. అప్పుడు చేతులు, కాళ్ళలో తిమ్మిరి, గందరగోళం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. తరచుగా ఈ లక్షణాలన్నీ శరీరానికి ఒక వైపున సంభవిస్తాయి. కానీ దీని ప్రభావం శరీరం అంతటా ఉంటుంది. కొన్నిసార్లు తల తిరగడం కూడా జరగవచ్చు. వాంతులు అవుతున్నట్లు కూడా అనిపించవచ్చు. మీరు ఇలాంటి లక్షణాలను ఎదుర్కొంటుంటే, డాక్టర్‌ను సంప్రదించడంలో ఆలస్యం చేయవద్దు.
అస్పష్టమైన మాట
కొన్నిసార్లు మీరు చెప్పాలనుకున్న మాటను చెప్పలేరు. పదాలు అస్పష్టంగా వస్తాయి. మాట్లాడటానికి కంఠం పెగలదు, తక్కువ స్వరంలో మాట్లాడతారు. కొన్నిసార్లు అసలే మాట్లాడలేకపోవచ్చు. ఇవి స్ట్రోక్‌కి సంబంధించిన సంకేతాలు కావచ్చు. మీరు దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి.
నిరంతరమైన తలనొప్పి
అమెరికన్ హార్ట్ హెల్త్ అసోసియేషన్ ప్రకారం, దీర్ఘకాలిక మైగ్రేన్లు స్ట్రోక్ ప్రమాదాన్ని 50 శాతం పెంచుతాయి. మీరు ఎప్పుడైనా అకస్మాత్తుగా భరించలేని తలనొప్పిని అనుభవించవచ్చు. ఇది మీకు తరచుగా జరిగితే, మీరు వెంటనే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి.
ఆగకుండా ఎక్కిళ్ళు
మీకు దాదాపు 30 సెకన్ల పాటు ఎక్కిళ్ళు ఉంటే, అది సాధారణనదే, భయమేం లేదు. జర్నల్ ఆఫ్ న్యూరాలజీ అండ్ న్యూరోఫిజియాలజీలో ప్రచురించిన పరిశోధన ప్రకారం, ఆగకుండా నిరంతరం ఎక్కిళ్ళు వస్తుంటే, ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కిళ్లు తగ్గకపోతే, అది స్ట్రోక్‌కు సంకేతం కావచ్చు. కాబట్టి ఎక్కిళ్లను నిర్లక్ష్యం చేయకండి.
అయితే గుండెపోటు రావడానికి ముందు కొన్ని లక్షణాలను మనం గుర్తించినట్లయితే.. రోగి ప్రాణాలను కాపాడవచ్చు. గుండె జబ్బులకు సంబంధించిన లక్షణాలపై శ్రద్ధ వహించకపోవడమే.. హార్ట్ స్ట్రోక్ కేసులు పెరగడానికి ప్రధాన కారణం. చాలా సందర్భాలలో, ఛాతీ నొప్పి లేకపోతే గ్యాస్ నొప్పి వచ్చినప్పుడు.. కొందరు పెద్దగా దాని గురించి పట్టించుకోరు. అయితే ఆ సమస్య కాస్తా గుండెపోటుకు దారి తీసే అవకాశం ఉంది. జన్యుపరమైన కారణాలు, అధిక మానసిక ఒత్తిడి కారణంగా కూడా గుండెపోటు రావచ్చు. కాబట్టి మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి.
గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు:
ఆకస్మిక అధిక చెమట
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
ఛాతీ నొప్పి, బిగుతుగా అనిపించడం, వికారం, ఎడమ చేయి, భుజం నొప్పి మెడ, దవడ, వెనుక భాగంలో నొప్పి ప్రసరిస్తుంది.
గుండె జబ్బులను ఎలా నివారించాలి..
విటమిన్లు, ప్రోటీన్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి.
ధూమపానం, మద్యపానాన్ని నిషేదించాలి. ప్రతి మూడు నెలలకోసారి గుండె ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి.
కనీసం ఏడు గంటలు నిద్రపోవాలి