Election Contest : టైటిల్ చదవగానే మీకు గుర్తొచ్చింది ఏంటి.. తెలంగాణ సీఎం కేసీఆర్ కదా. అవును అంటారా? ఎందుకంటే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో సీఎం కేసీఆర్ పేరు రెండు నియోజకవర్గాల్లో ఉంది. అంటే ఆయన గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ.. ఒకే అభ్యర్థి రెండు నియోజకవర్గాల నుంచి లేదా అంతకంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయొచ్చా? అలా సాధ్యమేనా? ఇలా ఇదివరకు ఎవరైనా పోటీ చేశారా? అసలు ఎన్నికల కమిషన్ ఏమంటోంది తెలుసుకుందాం రండి.
నిజానికి కేసీఆర్ ఒక్కరే ఇలా ఇప్పుడు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు అని అనుకోకండి. ఎందుకంటే ఇదివరకు చాలామంది రాజకీయ నాయకులు ఇలా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. పోటీ చేసి రెండు నియోజకవర్గాల్లో గెలిచిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే.. పెద్ద పెద్ద నాయకులు, తాము గెలిస్తేనే పెద్ద పదవి చేపట్టే వాళ్లు ఇలా ఒక నియోజకవర్గంలో గెలుస్తామా లేదా అనే డౌట్ ఉంటే ఇంకో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారు. అయితే.. ఇలా అభ్యర్థులు తమకు నచ్చినట్టుగా ఎన్ని నియోజకవర్గాల్లో అయినా పోటీ చేయొచ్చు కానీ.. అక్కడ నష్టం వచ్చేది మాత్రం ఎన్నికల కమిషన్ ఖజానాకు. ఎందుకంటే.. రెండు నియోజకవర్గాల్లో ఒకే అభ్యర్థి గెలిస్తే.. అప్పుడు రెండింట్లో ఒక నియోజకవర్గానికి ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. అప్పుడే మళ్లీ ఆ నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించాలి. ఇది డబుల్ ఖర్చే కదా.
Election Contest : అసలు ఎన్ని స్థానాల్లో ఒక అభ్యర్థి పోటీ చేయొచ్చు?
నిజానికి ఒక అభ్యర్థి రెండు నియోజకవర్గాల్లో ఒకేసారి పోటీ చేయొచ్చు. అది రాజ్యాంగం ప్రకారం సమ్మతించదగినదే. కానీ.. దాని వల్ల ప్రభుత్వ ఖజానాకు మాత్రం నష్టమే. నిజానికి ఒక అభ్యర్థి ఒకటే నియోజకవర్గంలో పోటీ చేయాలని చాలా రోజుల నుంచి చాలా పిటిషన్లు కోర్టుల్లో దాఖలు అవుతున్నా వాటిని కోర్టు ఎప్పటికప్పుడు తిరస్కరిస్తోంది.
దీనిపై గతంలో లా కమిషన్ చాలా సిఫారసులు చేసింది. కానీ.. అవి కేవలం సిఫారసులే కావడంతో వాటి ఎన్నికల కమిషన్ అమలు చేయలేదు. ఒకే నియోజకవర్గం నుంచి అభ్యర్థి పోటీ చేయాలని.. ఒకవేళ రెండు చోట్ల పోటీ చేస్తే.. ఒక నియోజకవర్గానికి రాజీనామా చేస్తే ఆ తర్వాత జరిగే ఉపఎన్నిక ఖర్చును అభ్యర్థే భరించాలని లా కమిషన్ ప్రతిపాదించినా.. అది ఆచరణలోకి మాత్రం రాలేదు. అందుకే.. ఇప్పటికీ చాలామంది అభ్యర్థులు రెండు చోట్ల ఒకేసారి పోటీ చేస్తున్నారు. ఇదివరకు పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల పోటీ చేశారు. రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ, ఇందిరా గాంధీ, పీవీ, ఎన్టీఆర్ లాంటి చాలామంది రాజకీయ నాయకులు రెండు చోట్ల పోటీ చేసిన వాళ్లే.