హిందూ పురాణాల ప్రకారం జమ్మి చెట్టుకు ఒక విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. అదేమిటంటే పాండవులు అరణ్యవాసానికి వెళ్లేటప్పుడు జమ్మి చెట్టు దగ్గర వారి ఆయుధాలను దాచి అరణ్యవాసం చేస్తారు. తిరిగి వచ్చిన తర్వాత జమ్మి చెట్టును పూజించి ఆ ఆయుధాలతో కౌరవుల మీద యుద్ధం చేసి విజయం సాధిస్తారు.అప్పటినుంచి పూజలలో జమ్మి ఆకులను ప్రత్యేకంగా వాడడం. పెద్దల చేతిలో జమ్మి ఆకులు ఉంచి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా జమ్మి పూలను నీళ్లలో వేసి శివుడికి పూజించడం వల్ల, ఏకంగా శివుడి కటాక్షమే కలుగుతుంది. అంత మహత్యం ఉన్న జమ్మి చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఆ కుటుంబం అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది.
అంతే కాకుండా విజయదశమి రోజున వాహనాలను కడిగి ఈ జమ్మి ఆకుతో పూజలు చేయించుకోవడం వల్ల అంతా శుభం కలుగుతుంది. ఇతర వ్యాపారస్తులు కూడా తమ పనిముట్లను శుభ్రం చేసుకుని ఈ జమ్మి ఆకుతో పూజ చేసుకుంటే వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కనపడుతుంది.ముఖ్యంగా పిల్లలు చదువులో వెనుకబడి ఉంటే జమ్మి చెట్టు వద్ద పుస్తకాలు ఉంచి పూజ చేసుకోవడం ద్వారా కూడా పిల్లలకు మంచి జ్ఞానం లభిస్తుంది. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్న.. చాలా కాలం నుండి పెళ్లి సంబంధాలు కుదరకపోయినా వెంటనే ఇంట్లో ఈ చెట్టు నాటడం ద్వారా సత్ఫలితాలను త్వరలోనే గమనించవచ్చు.
ఇంకా ఆ ఇంటికి నరదృష్టి, ఏవైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. శనివారం రోజు జమ్మి చెట్టుకు పూజ చేయడం వల్ల ఏలినాటి శని దూరం అవడమే కాకుండా ఇంట్లో ఉన్న అనేక సమస్యలకు చక్కటి పరిష్కారాలు దొరుకుతాయి. ఇంట్లో దీర్ఘకాలికంగా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి.పాండవులు అంతటివారే విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజ చేశారంటే ఈ చెట్టు మహత్యం ఏమిటో మాటలలో చెప్పడం చాలా కష్టం. మొదలుపెట్టే ప్రతి పని జమ్మి చెట్టుకు నమస్కరించుకుని మొదలుపెట్టడం ద్వారా కచ్చితంగా విజయం సాధించవచ్చు.
ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు జమ్మి చెట్టుకు నమస్కరించడం ద్వారా వెళ్లిన పని కూడా ఏ సమస్యలు లేకుండా పూర్తవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఇంటిని రక్షణలో ఉంచినట్లే. ఈ చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే జీవితం కూడా ప్రశాంతంగా.. ఎటువంటి టెన్షన్స్ లేకుండా గడపవచ్చు.ముఖ్యంగా ఈ జమ్మి చెట్టును శనివారం రోజు నాటుకోవాలి. లేదంటే విజయదశమి రోజున కూడా నాటుకోవచ్చు. ఇంకా ఈ చెట్టును ఇంటికి కాస్త ముఖద్వారం కనపడేటట్టుగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కుడివైపున ఉండేటట్టు నాటుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ ఇంటి పైకప్పు భాగంలో ఈ చెట్టు మొక్కను నాటాలి అనుకుంటే దక్షిణం వైపు నాటితే మంచిది.