Mobile Number : అవును.. మీ మొబైల్ నెంబర్ ను ఎక్కడ పడితే అక్కడ ఇస్తున్నారా? నెంబరే కదా ఇస్తే ఏమౌతుందిలే అని నెంబర్, పేరు, అడ్రస్ అన్నీ ఇచ్చేయకండి. అలా ఇవ్వడం వల్ల మీకే నష్టం. అలా ఎలా నష్టం అంటారా? పదండి.. వివరంగా తెలుసుకుందాం.
ఉదాహరణకు మీరు ఒక షాపింగ్ మాల్ కు వెళ్లారనుకోండి. షాపింగ్ చేసిన తర్వాత బిల్ వేయమంటారు. బిల్ వేసే వ్యక్తి మీరు కొన్న వస్తువులకు బిల్ వేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతాడు. మీరు వెంటనే మీ మొబైల్ నెంబర్ కూడా చెప్పేస్తారు. కానీ.. మీ మొబైల్ నెంబర్ ఎందుకు అని మాత్రం అడగరు. కానీ.. మీరు ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ ఎందుకు అడుగుతున్నారో ప్రశ్నించాలి. అసలు మొబైల్ నెంబర్ కు, బిల్ జనరేట్ చేయడానికి ఏంటి సంబంధం. నెంబర్ ఇవ్వకపోతే బిల్ జనరేట్ కాదని చెబుతారు. కానీ.. అదంతా అబద్ధం అస్సలు మీ నెంబర్ ఇవ్వాల్సిన అవసరమే లేదు.
Mobile Number : నెంబర్ ఇవ్వాలని పట్టుబడితే ఏం చేయాలి?
కన్జ్యూమర్స్ అఫేర్స్ మినిస్ట్రీ రూల్స్ ప్రకారం బిల్ జనరేట్ చేయడానికి ఫోన్ నెంబర్ ఖచ్చితం కాదు. అలాగే ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది షాప్ కీపర్స్ కస్టమర్లను ఫోన్ నెంబర్లు అడిగి ఇబ్బంది పెట్టవద్దు అని. అయినా కూడా నెంబర్ అడిగితే మేం ఇవ్వం అని ఖరాఖండిగా చెప్పేయండి.
ఎందుకంటే.. మీరు ఇచ్చిన మీ ఫోన్ నెంబర్ తో వాళ్లు చాలా గేమ్స్ ఆడుతారు. మీ డేటా మొత్తం కలెక్ట్ చేసి క్రెడిట్ కార్డు కంపెనీలకో, ఇన్సురెన్స్ కంపెనీలకో, లేదా వేరే ఏ కంపెనీకి అయినా అమ్ముకుంటారు. డేటా అమ్ముకొని వాళ్లు సొమ్ము చేసుకుంటారు.
అలా.. మీ డేటా మొత్తం ఒకరి నుంచి మరొకరికి చేతులు మారుతూ ఉంటుంది. అందుకే మీరు క్రెడిట్ కార్డు కావాలా అని ఒక ఫోన్, ఇన్సురెన్స్ తీసుకుంటారా అని మరొక ఫోన్, లోన్ కావాలా అని ఇంకో ఫోన్.. ఇలా ఫోన్లు చేస్తూనే ఉంటారు.
అందుకే.. మీరు ఎక్కడికెళ్లినా మీ ఫోన్ నెంబర్ ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఒకవేళ ఫోన్ నెంబర్ కంపల్సరీ అనే చోట మాత్రమే ఇవ్వండి. ఎక్కడ పడితే అక్కడ అస్సలు ఫోన్ నెంబర్స్ ఇవ్వకండి. ఇబ్బందులో పడకండి. ఒక్కోసారి ఆ ఫోన్ నెంబర్లు సైబర్ క్రిమినల్స్ చేతుల్లోనూ పడతాయి. అప్పుడు వాళ్లు మీ మొబైల్ కి డేంజరస్ లింక్స్ పంపి మీరు ఆ లింక్స్ మీద క్లిక్ చేయగానే మీ అకౌంట్ ను ఖాళీ చేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే అవసరం లేని చోట మీ ఫోన్ నెంబర్ అస్సలు ఇవ్వకండి.