BC Caste Workers Scheme : తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ల అయింది. ఈసందర్భంగా తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈనేపథ్యంలో తెలంగాణకు చెందిన బీసీ కులస్తులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. తమ కులవృత్తులు చేసుకుంటూ జీవనం సాగించే బీసీ కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.
తొలి విడత కింద బీసీకి చెందిన కొన్ని కుటుంబాలకు సాయం అందించేందుకు కొన్ని కులాల జాబితాను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. బీసీల్లోని 15 కులాలకు తొలి విడతలో భాగంగా లక్ష గ్రాంట్ ను అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే బీసీ సంక్షేమ శాఖ తొలి 15 కులాల జాబితాను విడుదల చేసింది.
నాయి బ్రాహ్మణులు, రజకలు, సగర(ఉప్పరోళ్లు), కుమ్మరి(శాలివాహన), అవుసుల(గోల్డ్ స్మిత్), కంసాలి, వడ్రంగి(శిల్పులు), వడ్డెర, కమ్మరి, కంచరి, మేదర, కృష్ణ బలిజ పూస, మేర(టైలర్స్, చింపోళ్లు), ఆరె కటిక, ఎంబీసీ కులాలకు ముందుగా లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.
BC Caste Workers Scheme : ఈ పథకం కింద ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వాళ్లు ముందు తమ అర్హత వివరాలను తెలుసుకోవాలి. ఒక కుటుంబంలో ఒకరికే ఆర్థిక సాయం అందుతుంది. గ్రామాల్లో నివసించే వాళ్ల ఆదాయం సంవత్సరానికి రూ.1.50 లక్షల లోపు ఉండాలి. పట్టణాల్లో నివసించే వారి వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వారు తమ ఫోటో, ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో https://tsobmmsbc.cgg.gov.in/ ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6 వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 5 సంవత్సరాల నుంచి ఎలాంటి ప్రభుత్వ పథకాల ద్వారా రూ.50 వేల కంటే ఎక్కువ లబ్ధి పొందిన వారు ఈ పథకం కింద అనర్హులు.
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న తర్వాత 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తులను మున్సిపాలిటీ స్థాయి అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ వెరిఫికేషన్ చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. తుది జాబితాను తయారు చేసి వెబ్ సైట్ లో పెడతారు. ఎంపికైన లబ్ధిదారులకు ప్రతి నెల 15వ తేదీన వాళ్ల అకౌంట్లలోకి వన్ టైమ్ బెనిఫిట్ కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఆ డబ్బుతో లబ్దిదారుడు తమ కులవృత్తి కోసం ఎలాంటి ఉపకరణాలను అయినా కొనుక్కోవచ్చు.