Train Insurance : మీరు ఎప్పుడైనా రైలులో ప్రయాణించారా? ఒకవేళ ఎప్పుడైనా మీరు ప్రయాణించిన రైలు ప్రమాదానికి గురైందా? దాదాపుగా అయి ఉండదు. ఎందుకంటే రైలు ప్రమాదాలు అనేవి చాలా అరుదు. మొన్న జరిగిన ఒడిశా రైలు ప్రమాదం లాంటివి చాలా రేర్ గా జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ అది మేజర్ యాక్సిడెంట్. రైలులో ప్రయాణించే వాళ్లు ఒకవేళ ఒడిశా రైలు లాంటి ప్రమాదానికి గురయితే.. చనిపోతే, గాయాలైతే ఎలా? వాళ్లకు ఇన్సురెన్స్ వర్తిస్తుందా? చనిపోయిన వాళ్ల కుటుంబాలకు బీమా డబ్బును ఇస్తారా? అసలు బీమా ఎలా రైల్వే ప్రయాణికులకు వర్తిస్తుంది అనే విషయాలు చాలామందికి తెలియదు.
అయితే.. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. టికెట్ తీసుకునే సమయంలోనే ట్రావెల్ ఇన్సురెన్స్ ఆప్షన్ ఉంటుంది. ట్రావెల్ ఇన్సురెన్స్ కోసం పెద్దగా డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. 35 పైసలు మాత్రమే అదనంగా ఈ ఇన్సురెన్స్ కోసం తీసుకుంటారు. మీరు ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ ఎక్కడైనా టికెట్ రిజర్వేషన్ చేసుకునే సమయంలో ట్రావెల్ ఇన్సురెన్స్ కూడా యాడ్ అవుతుంది. ఒకవేళ ఇన్సురెన్స్ వద్దు అనుకుంటే.. ఆ ఆప్షన్ ను డిసేబుల్ చేసుకోవాలి.
Train Insurance : కన్ఫమ్ లేదా ఆర్ఏసీ టికెట్లకే ఇన్సురెన్స్ వర్తింపు
కొందరు టికెట్ బుక్ చేసుకుంటారు కానీ అవి వెయిటింగ్ లిస్టులో ఉంటాయి. కన్ఫమ్ కావు. అటువంటి టికెట్ల మీద ఇన్సురెన్స్ వర్తించదు. కేవలం కన్ఫమ్ అయిన, ఆర్ఏసీ టికెట్ల మీదనే ఇన్సురెన్స్ వర్తిస్తుంది. అది కూడా భారతదేశానికి చెందిన పౌరులై ఉండాలి. విదేశీయులకు ట్రావెల్ ఇన్సురెన్స్ వర్తించదు. అలాగే.. 5 ఏళ్ల లోపు పిల్లలకు ఈ ట్రావెల్ ఇన్సురెన్స్ వర్తించదు. వాళ్లకు టికెట్ తీసుకోరు కాబట్టి వాళ్లకు ఇన్సురెన్స్ ఉండదు.
ఒకవేళ మీరు ప్రయాణించే రైలు ప్రమాదానికి గురయితే.. ప్రమాదం జరిగిన నాలుగు నెలల్లోపు ఇన్సురెన్స్ కంపెనీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు చనిపోయినా, శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడినా అటువంటి వాళ్లకు గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు ఇన్సురెన్స్ కంపెనీ అందిస్తుంది. ఆ డబ్బును నామినీకి అందజేస్తారు. ఆసుపత్రిలో చేరిన ప్రయాణికులకు రూ.2 లక్షల వరకు వైద్య ఖర్చులను ఇన్సురెన్స్ కంపెనీ భరిస్తుంది. స్వల్ప గాయాలు అయితే రూ.10 వేలు చెల్లిస్తారు.