Umbilical Cord Blood Storage : మీకు గుర్తుందా? ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు పాప పుట్టింది. అయితే.. ఆయనకు పుట్టిన పాప బొడ్డు తాడుని, బొడ్డు తాడు రక్తాన్ని ప్రిజర్వ్ చేశారంటూ బాగా వార్తలు వస్తున్నాయి. అసలు ఆ బొడ్డు తాడును ఎందుకు ప్రిజర్వ్ చేస్తారు. ఆ రక్తం ప్రిజర్వ్ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి. సామాన్య ప్రజలు కూడా అలా ప్రిజర్వ్ చేసుకోవచ్చా? దాన్ని ప్రిజర్వ్ చేసే సంస్థలు కూడా ఉంటాయా? ఎంత చార్జ్ చేస్తాయి అనే విషయం చాలామందికి తెలియదు.
బొడ్డు తాడును అంబిలికల్ కార్డ్ అంటారు. దాని రక్తాన్ని అంబిలికల్ కార్డ్ బ్లడ్ అంటారు. రామ్ చరణ్ కు పుట్టిన పాప అంబిలికల్ కార్డ్ బ్లడ్ ను స్టోరేజ్ చేస్తున్నట్టు రామ్ చరణ్ భార్య ఉపాసన ఇటీవల ట్వీట్ చేశారు. వీళ్లే కాదు.. చాలామంది సెలబ్రిటీల తమ పిల్లలు పుట్టగానే వాళ్ల అంబిలికల్ కార్డ్ బ్లడ్ ను భద్రపరుచుకుంటారు. టాలీవుడ్ హీరో మహేశ్ బాబు కూడా తమ పిల్లల అంబిలికల్ కార్డ్ బ్లడ్ ను భద్రపరిచారు. బాలీవుడ్ లోనూ పలువురు సెలబ్రిటీలు తమ పిల్లల బొడ్డు తాడు రక్తాన్ని ప్రిజర్వ్ చేసుకున్నారు.
Umbilical Cord Blood Storage : అసలు.. దీన్ని ప్రిజర్వ్ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి?
అసలు బొడ్డు తాడు అంటే ఏంటో తెలుసా మీకు. కడుపులో పెరుగుతున్న బిడ్డకు, తల్లికి మధ్య ఉన్న ఒక అనుసంధానం అది. బొడ్డు తాడు ద్వారానే తల్లి నుంచి బిడ్డకు అన్నీ అందుతాయి. ఈ బొడ్డు తాడులో రక్తనాళాలు ఉంటాయి. డెలివరీ తర్వాత కూడా బిడ్డ, తల్లి మధ్య ఈ బొడ్డు తాడు అనుసంధానంగా ఉంటుంది. అప్పుడే తల్లి నుంచి బిడ్డను వేరు చేయడానికి.. బొడ్డు తాడును డాక్టర్లు కత్తిరిస్తారు. దానికి ముడివేస్తారు.
అయితే.. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే.. బిడ్డ పుట్టగానే తల్లి గర్భసంచిలో ఉన్న మాయ కూడా బయటికి వస్తుంది. దాన్నే ప్లసెంటా అంటారు. బిడ్డ పుట్టిన తర్వాత ఆ మాయలో కొంత రక్తం ఉంటుంది. బొడ్డు తాడులోనూ కొంత రక్తం ఉంటుంది. దీన్నే కార్డ్ బ్లడ్ అంటారు.
నిజానికి.. చాలామంది శిశువు పుట్టగానే మాయను పడేస్తారు. కానీ.. దీనిలో స్టెమ్ సెల్స్ ఉంటాయని డాక్టర్ల పరిశోధనలో రుజువు అయింది. ఈ స్టెమ్ సెల్స్ బొడ్డు తాడులోనూ ఉంటాయి. కాబట్టి మాయలోని రక్తాన్ని, బొడ్డు తాడులోని రక్తాన్ని, బొడ్డు తాడు.. వీటన్నింటినీ ప్రిజర్వ్ చేస్తుంటారు.
కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ సంస్థలు వీటిన్ని ప్రిజర్వ్ చేస్తుంటాయి. పిల్లలు పెరిగి పెద్ద అవుతున్న క్రమంలో వాళ్లకు లుకేమియా, అనీమియా, తలసీమియా లాంటి జబ్బులు ఏవైనా వస్తే.. వాటిని నయం చేయడం కోసం ప్రిజర్వ్ చేసిన బొడ్డు తాడు రక్తంలోని స్టెమ్ సెల్స్ ను తీసుకొని ట్రీట్ మెంట్ చేస్తారు. అందుకే.. చాలామంది వాటిని తమ పిల్లలు పుట్టగానే ప్రిజర్వ్ చేస్తుంటారు.
అయితే.. ఈ కార్డ్ బ్లడ్ ను స్టోర్ చేసుకునేందుకు కొన్ని సంస్థలు బాగానే చార్జ్ చేస్తాయి. ఎన్ని ఏళ్లు భద్రపరచాలి అనే దాని మీద ధర ఆధారపడి ఉంటుంది. కనీసం 20 ఏళ్లు దాన్ని భద్రపరిస్తే.. మినిమిం రూ.50 వేల వరకు తీసుకుంటారు. ఇలాంటి సంస్థలు మన దగ్గర కూడా చాలానే అందుబాటులో ఉన్నాయి.