Video Recording In Theatres : ఒకప్పుడు స్మార్ట్ ఫోన్లు లేవు కాబట్టి ఎవ్వరైనా సరే.. సినిమా రిలీజ్ అయింది అంటే నేరుగా థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే. లేదంటే ఆ సినిమా టీవీలోకి వస్తేనే చూసేవాళ్లం. పాత కాలం నాటి రోజుల్లో ఇదే జరిగేది. టీవీలో ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారు. సినిమా విడుదలైన కనీసం సంవత్సరం తర్వాత ఆ సినిమా టీవీల్లోకి వచ్చేది. కానీ.. నేడు అలా లేదు.. చేతుల్లోనే సినిమా చూసేస్తున్నాం. దానికి కారణం స్మార్ట్ ఫోన్లు. ఈ మధ్య ఓటీటీలు కూడా రాజ్యమేలుతున్నాయి. పైరసీలు కూడా ఎక్కువైపోయాయి. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్ లో దర్శనమిస్తోంది. అందుకే.. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కొత్త చట్టాలు వచ్చాయి.
సాధారణంగా కొందరు అయితే థియేటర్లలో సినిమా మొత్తం తమ ఫోన్లలో రికార్డు చేస్తుంటారు. ఫోన్ లో రికార్డు చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడమూ.. యూట్యూబ్ లో పెట్టడమో లేదంటే సినిమాను బిట్లు బిట్లుగా రికార్డు చేసి ఫ్రెండ్స్ కి షేర్ చేయడం, ఇలా చాలా పనులు చేస్తుంటారు. అటువంటి వాళ్ల కోసమే ఈ కథనం. ఇక మీదట మీరు థియేటర్ లోకి వచ్చి ఫోన్ ను సైలెంట్ గా జేబులో పెట్టుకోవాల్సిందే. సినిమా చూస్తూ ఫోన్ ను తీసి సినిమా టైటిల్ కార్డు, హీరో ఇంట్రడక్షన్, క్లయిమాక్స్ ను షూట్ చేసి స్టాటస్ లుగా పెట్టుకోవడం, ఫ్రెండ్స్ కు పంపించడం చేస్తే అడ్డంగా బుక్ అయిపోతారు.
Video Recording In Theatres : సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు చేసిన కేంద్రం
ప్రస్తుతం ఉన్న సినిమాటోగ్రఫీ చట్టంలో కేంద్రం సవరణలు చేసింది. దాని ప్రకారం థియేటర్ లో సినిమాకు సంబంధించి ఒక్క ఫోటో తీసినా, ఒక్క సెకన్ వీడియో తీసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసినా కనీసం మూడు నెలల నుంచి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
అంతే కాదు.. కనీసం రూ.5 లక్షల జరిమానా విధిస్తారు. లేదంటే సినిమా బడ్జెట్ లో కనీసం 10 శాతం ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని తాజాగా లోక్ సభలో ఆమోదింపజేశారు. అందుకే ఇక నుంచి థియేటర్లలోకి సినిమాకు వెళ్తే ఆవేశపడి ఫోన్లలో సినిమాను రికార్డు చేస్తే ఇక పని అయిపోయినట్టే. మీరు థియేటర్ లో ఫోన్ తీసి పరదా వైపు చూస్తూ ఫోన్ ఫోటో తీసినా చాలు వెంటనే దొరికిపోతారు.
థియేటర్లలో సీసీ కెమెరాలు ఉంటాయి. సీటు నెంబర్ తో సహా దొరికిపోతారు. ఒకవేళ థియేటర్ లో దొరక్కపోయినా మీరు ఆవేశపడి వాటిని ఎక్కడ అప్ లోడ్ చేస్తే అక్కడ ఐపీ అడ్రస్ తో దొరికిపోతారు. కాబట్టి ఇక నుంచి అయినా థియేటర్లలో సైలెంట్ గా సినిమా చూసి వచ్చేయండి. ఒక్క ఫోటో తీసినా కనీసం మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు జాగ్రత్త.