Employment Bond : ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే చాలా కష్టపడాలి. ఈ రోజుల్లో అయితే ఏళ్లకు ఏళ్లు రాత్రి అనకా పగలు అనకా చదివితేనే ఉద్యోగం వస్తుంది. కానీ.. ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. నూటికో కోటికో ఒక్కరికి వస్తుంది. మరి మిగితా వాళ్ల పరిస్థితి ఏంటి అంటారా? వాళ్లు వేరే జాబ్ వెతుక్కోవడమే. ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోతే ప్రైవేటు ఉద్యోగాలు ఉన్నాయి కదా అంటారా? అవును.. ప్రభుత్వ ఉద్యోగాల కన్నా కూడా లక్షల కొద్దీ ప్రైవేటు ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. కానీ.. ప్రైవేటు ఉద్యోగాల్లో చేరాలంటే సవాలక్ష కండిషన్లు పెడతారు.
ముఖ్యంగా ఫ్రెషర్స్ కి కొన్ని కంపెనీలు బాండ్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తుంటాయి. దానికి కారణం.. ఫ్రెషర్స్ గా తీసుకొని వాళ్లకు ట్రెయినింగ్ ఇచ్చి.. ట్రెయినింగ్ సమయంలో కూడా జీతం ఇచ్చి వాళ్లను ఉద్యోగంలోకి తీసుకుంటారు కాబట్టి.. ట్రెయినింగ్ అయిపోయాక.. వాళ్లు ఉద్యోగంలో చేరకుండా వేరే కంపెనీలో చేరితే. అప్పుడు ముందు ట్రెయినింగ్ ఇచ్చిన కంపెనీ లాస్ అవుతుంది కదా. అందుకే చాలా కంపెనీలు ఇలా ట్రెయినింగ్ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. బాండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తాయి. లేదా ఒరిజినల్ సర్టిఫికెట్స్ కావాలని అడుగుతారు. కొన్ని కంపెనీలలో బాండ్ తో పాడు ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా తీసుకుంటారు.
Employment Bond : సడెన్ గా మధ్యలో ఉద్యోగం మానేయాల్సి వస్తే ఏం చేయాలి?
బాండ్ ఉన్నా కూడా కొందరు కంపెనీలలో చేరుతుంటారు. దానికి కారణం.. ఆర్థిక పరిస్థితులు. ఒకవేళ బాండ్ బ్రేక్ చేస్తే అదనంగా కొంత డబ్బు కట్టి ఆ కంపెనీ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. అదే బాండ్ లో కంపెనీలు రాసే రూల్. మధ్యలో వెళ్లిపోతే ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వరు.
కానీ.. అసలు ఇలాంటి ఉద్యోగానికి సంబంధించిన బాండ్స్, కంపెనీలు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకోవడం మన దేశంలో చట్టబద్ధమేనా? అనే విషయాన్ని ఎవ్వరూ తెలుసుకోరు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. మన దేశంలో ఉద్యోగం కోసం బాండ్ తీసుకోవడం అనేది నేరం.
ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 27 ప్రకారం జాబ్ లో చేరుతున్నప్పుడు కాంట్రాక్ట్స్ పై పెట్టిన సంతకాలు పని చేయవు. అలాగే.. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 388 ప్రకారం ఉద్యోగుల ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను కంపెనీలు ఉంచుకోవడానికి వీలు లేదు. అది చట్టరిత్యా నేరం.
అలాగే.. ఆర్టికల్ 19 ప్రకారం ఒక వ్యక్తి తనకు నచ్చిన చోట పని చేసే హక్కు అతడికి ఉంటుంది. కాబట్టి ఒకే కంపెనీలో బాండ్ పేరుతో అతడిని బలవంతంగా పని చేయించకూడదు.
ఒకవేళ ఆ ఉద్యోగికి శిక్షణ కోసం ఎంత ఖర్చు కంపెనీ పెడుతుందో ఆ ఖర్చును మాత్రమే వెనక్కి తీసుకోవాలి కానీ.. బాండ్ మీద రాసినట్టుగా రూ.10 లక్షలు, రూ.20 లక్షలు తీసుకోవడానికి వీలు లేదని సుప్రీం కోర్టు కూడా తీర్పు చెప్పింది.