Telangana Rationcard : రేషన్ కార్డు తెలుసు కదా. దాని వల్ల ఉచితంగా ప్రతి నెల బియ్యం ఇస్తారు. ఏదైనా ఆపద సమయాల్లో ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవాళ్లకు ఆర్థిక సాయం చేస్తుంటుంది. ఇలా.. రేషన్ కార్డు ఉన్నవాళ్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలన్నీ వర్తిస్తాయి. అందుకే రేషన్ కార్డు కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు. రేషన్ కార్డు వస్తే చాలు హమ్మయ్య.. ప్రతి నెల ఉచితంగా బియ్యం అయినా వస్తాయి కదా అనుకుంటారు. మీకు ఇంకో విషయం తెలుసా? తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కొత్త రేషన్ కార్డులను కూడా ఇస్తోంది. పాత రేషన్ కార్డులో పేర్లలో మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు. ఇదంతా ఓకే కానీ.. ఉన్న రేషన్ కార్డు కూడా కొందరికి పోయే ప్రమాదం ఉంది.
ఎందుకంటే.. ఇప్పటికే రేషన్ కార్డుల్లో ఉన్న పేర్లలో చాలామంది చనిపోయి ఉంటారు. కొన్ని బోగస్ కార్డులు కూడా ఉన్నాయట. అందుకే బోగస్ కార్డులను ఏరేసేందుకు, రేషన్ కార్డుల్లో ఉన్న పేర్లు అసలు నిజమైన లబ్దిదారులవేనా.. అనేది తెలుసుకోవడం తెలంగాణ ప్రభుత్వం ఈ పని చేస్తోంది. దాని కోసం రేషన్ కార్డుదారులు ఒక పని చేయాలి. వెంటనే మీ రేషన్ షాపునకు వెళ్లి మీ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
Telangana Rationcard : రేషన్ కార్డులో పేరు ఉన్నవాళ్లంతా కేవైసీ చేయాలి
రేషన్ కార్డులో ఎంతమంది పేర్లు ఉంటే అంతమంది వెంటనే రేషన్ షాపునకు వెళ్లి కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. చిన్నపిల్లలు ఉన్నా.. వృద్ధులు అయినా ఎవరైనా సరే.. రేషన్ షాపునకు వెళ్లాలి. ఇప్పటికే తెలంగాణ పౌర సరఫరాల శాఖ.. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
చనిపోయిన వాళ్ల పేర్లు రేషన్ కార్డుల నుంచి తొలగించని వాళ్లు, బోగస్ కార్డులు, కావాలని లేని వ్యక్తుల పేర్లను కూడా ఎక్కించుకొని ఫ్రీగా రేషన్ బియ్యం తీసుకుంటున్న వాళ్ల కార్డులు కేవైసీ వల్ల పోతాయి. పెళ్లిళ్లు అయి వేరే ఊరికి వెళ్లిన మహిళలు, కుటుంబం నుంచి వేరు పడిన పురుషుల పేర్లు కూడా అలాగే కార్డుల్లో ఉండిపోవడంతో సరిగ్గా లెక్క తేలడం లేదు. అందుకే ప్రభుత్వం కేవైసీ ప్రక్రియను చేపట్టింది.
అందుకే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు, రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరు రేషన్ దుకాణానికి వెళ్లి కేవైసీ ప్రక్రియ చేయాలి. అక్కడ వేలి ముద్ర వేస్తే కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. ఆధార్ నెంబర్ తో, వేలి ముద్రను పోల్చి చూస్తారు. అలా బోగస్ కార్డులను, బోగస్ రేషన్ కార్డు దారులను ప్రభుత్వం ఏరివేయనుంది. అసలైన లబ్ధిదారులను గుర్తించిన తర్వాత కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు ప్రభుత్వం అందించనుంది.