Telangana Gruhalakshmi Scheme : మీకు సొంత జాగా ఉందా? ఇల్లు లేదా? మీలాంటి వాళ్ల కోసమే తెలంగాణ ప్రభుత్వం ఒక స్కీమ్ ను తీసుకొచ్చింది. అదే గృహలక్ష్మి పథకం. సొంత జాగ ఉండి.. ఇండ్లు లేని పేదల కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద సొంత ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3 లక్షలు ఇస్తుంది. అయితే.. ఈ పథకానికి ఎవరు అర్హులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. అనే దానిపై చాలామందికి క్లారిటీ లేదు.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందికి మాత్రమే సాయం అందించనున్నారు. అంటే.. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలకు కలిపి మొత్తం 3 వేల ఇండ్ల చొప్పున 4 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. గృహలక్ష్మి పథకం కోసమే తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ.7350 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ మూడు లక్షల సాయాన్ని మూడు దశల్లో అందించనున్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభించాక.. బేస్ మెంట్ స్థాయిలో లక్ష ఇస్తారు. పైకప్పు దశలో ఉన్నప్పుడు మరో లక్ష సాయం, పైకప్పు దశలో మరో లక్ష, నిర్మాణం పూర్తయ్యాక లక్ష చెల్లిస్తారు.
Telangana Gruhalakshmi Scheme : ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్లు ముందు ఇంటి నిర్మాణం కోసం ఖాళీ జాగాను సమకూర్చుకోవాలి. ఆ కుటుంబానికి రేషన్ కార్డు ఉండడాలి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ ఉండాలి. ఇప్పటికే ఆర్సీసీ రూఫ్ ఉన్న ఇల్లు ఉండకూడదు. జీవో 59 కింద లబ్ధి పొంది ఉండకూడదు. దీని కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. గృహలక్ష్మి పథకం కోసం సపరేట్ వెబ్ సైట్ ఉంది.
ప్రతి నియోజకవర్గంలో రిజర్వేషన్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకొని అన్ని డాక్యుమెంట్స్ సమర్పించిన తర్వాత వాటిని పరిశీలించి కలెక్టర్ అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన లబ్ధిదారులకు దశలవారీగా ఆర్థిక సాయం అందజేస్తారు.
ఇంట్లోని మహిళ పేరు మీదనే ఈ పథకం మీద సాయం అందుతుంది. లబ్ధిదారులు తమకు నచ్చిన విధంగా ఇంటిని నిర్మించుకోవచ్చు. కాకపోతే పథకం ద్వారా లబ్ధి పొందిన తర్వాత.. ఇంటి మీద గృహలక్ష్మి లోగోను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక.. ఈ పథకాన్ని వచ్చే నెల జులై నుంచి ప్రారంభించనున్నారు. పథకం ప్రారంభం కాగానే.. దరఖాస్తు విధానం, చివరి తేదీ ప్రకటిస్తారు. ఆ తేదీ లోపు ఈ పథకం కింద ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.