PMJJBY : మీకు పీఎంజేజేబీవై స్కీమ్ గురించి తెలుసా? ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ గురించే మనం మాట్లాడుకునేది. ఈ స్కీమ్ కనీసం లైఫ్ ఇన్సురెన్స్ ప్రీమియం కూడా కట్టలేని వారి కోసం. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉండి ఏదైనా ఆర్బీఐ అనుమతి పొందిన బ్యాంకులో అకౌంట్ ఉంటే చాలు. మీరు ఈ స్కీమ్ కింద అర్హులు అవుతారు. ఇది ఒక లైఫ్ ఇన్సురెన్స్. కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువ ప్రీమియంతో ఈ దేశ ప్రజలకు అందిస్తున్న బెస్ట్ లైఫ్ ఇన్సురెన్స్ స్కీమ్ ఇది.
ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఉంటే ఆ బ్యాంకుకే వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక ఫామ్ నింపాల్సి ఉంటుంది అంతే. ప్రతి సంవత్సరం బ్యాంకే మీ బ్యాంక్ ఖాతా నుంచి రూ.436 కట్ చేసుకుంటుంది. ఈ స్కీమ్ ద్వారా లైఫ్ ఇన్సురెన్స్ తీసుకుంటే ఆ వ్యక్తికి 2 లక్షల లైఫ్ ఇన్సురెన్స్ వర్తిస్తుంది.
PMJJBY : 50 ఏళ్ల వరకు ఈ స్కీమ్ కి అర్హత పొందొచ్చు
18 ఏళ్లు నిండిన వ్యక్తి 50 ఏళ్ల వరకు ఈ స్కీమ్ కి అర్హత పొందుతారు. 50 ఏళ్ల వరకు సంవత్సరానికి రూ.436 కట్ అవుతాయి. ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్న వారు ఏ కారణం చేత చనిపోయినా కూడా వాళ్ల కుటుంబానికి 60 రోజుల్లో రూ.2 లక్షలను ప్రభుత్వం అందిస్తుంది.
రోడ్డు ప్రమాదంలో చనిపోయినా, సహజంగా చనిపోయినా, ఇంకా అనారోగ్య కారణాలు, ఇతర కారణాలు.. ఏవైనా సరే.. ఈ స్కీమ్ కింద అప్లయి చేసుకున్న వాళ్లు చనిపోతే వాళ్ల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది. దాని కోసం మీరు చేయాల్సిందల్లా ప్రతి సంవత్సరం మీ అకౌంట్ లో కనీసం రూ.436 డబ్బులు ఉండేలా చేసుకోవడమే. అకౌంట్ లో డబ్బులను బట్టి ప్రతి సంవత్సరం బ్యాంకే మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసుకొని మీ ప్రీమియం ను రెన్యువల్ చేస్తుంది.
ఒకవేళ మీ బ్యాంక్ ఖాతాలో అంత డబ్బు లేకపోతే.. మీరు ఎప్పుడు డబ్బులు డిపాజిట్ చేస్తే అప్పుడు వెంటనే బ్యాంకు ప్రీమియం డబ్బులను కట్ చేసుకుంటుంది. మళ్లీ మీ ప్రీమియం రెన్యువల్ అవుతుంది. అందుకే.. వేలకు వేలు పెట్టి లైఫ్ ఇన్సురెన్స్ తీసుకోలేని వాళ్లు ఈ స్కీమ్ కింద సంవత్సరానికి కేవలం రూ.436 కట్టి రూ. 2 లక్షల కవరేజ్ పొందొచ్చు.